తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాలలో పనిచేస్తున్న టీచర్లు, ఆయాలకు మంత్రి సీతక్క శుభవార్త ప్రకటించారు. ఇకపై పదవీ విరమణ చేసే సిబ్బందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తామని తెలిపారు. రెండు మూడు రోజులలో దీనికి సంబంధించి జీవో జారీ చేస్తామని పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం హైదరాబాద్ లోని రహమత్ నగర్ లో జరిగిన ‘అమ్మ మాట- అంగన్వాడీ బాట’ కార్యక్రమంలో మంత్రి సీతక్క ఈ ప్రకటన చేశారు.రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద పదవీ విరమణ పొందే టీచర్ కు రూ.2 లక్షలు, ఆయాలకు రూ. లక్ష చొప్పున తెలంగాణ ప్రభుత్వం అందజేయనుంది. నామమాత్రపు వేతనంతో సేవలందిస్తున్న అంగన్వాడీ సిబ్బంది కష్టాలు ప్రభుత్వానికి తెలుసని మంత్రి చెప్పారు. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని, రెండు మూడు రోజుల్లో ఈమేరకు జీవో విడుదల చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు.