అనేక బీజేపీయేతర రాష్ట్రాలు, పౌర సమాజం, న్యాయ నిపుణులు లేవనెత్తుతున్న ప్రశ్నల మధ్య మూడు క్రిమినల్ చట్టాలు జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి.
- ఇండియన్ పీనల్ కోడ్, 1860 (ఐపీసీ) స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) 2023
- క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 (సీఆర్పీసీ) స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) 2023
- ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 (ఐఈ చట్టం) స్థానంలో భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) 2023
ఈ కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినా, జూన్ 30 వరకు జరిగిన నేరాలకు సంబంధించి పోలీసు విచారణ, కోర్టులు పాత చట్టాల ప్రకారం పనిచేస్తాయి.
ఇప్పుడు ఏకకాలంలో రెండు రకాల చట్టాల ప్రకారం పని జరుగుతుంది.
ఈ చట్టాల పేరును కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు - ఈ చట్టాల పేర్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 348ని ఉల్లంఘిస్తున్నాయని, దీని కింద చట్టాల పేర్లు ఆంగ్లంలో ఉండాలని అంటున్నాయి.ఈ మూడు చట్టాలపై ఇలాంటి అనేక అభ్యంతరాలు, ప్రశ్నలు తలెత్తుతున్నా కేంద్రం వాటిని పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ముఖ్యమంత్రులు ఈ చట్టాన్ని వెంటనే అమలు చేయవద్దని డిమాండ్ చేశారు.ఈ మూడు కొత్త చట్టాల అధ్యయనానికి అధికారిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రాలలో కర్ణాటక ఒకటి.ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్.కె. పాటిల్ నేతృత్వంలోని కమిటీ గత ఏడాది కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఒక నివేదికను సమర్పించగా, హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సూచనలను కోరింది.
పాటిల్ బీబీసీతో మాట్లాడుతూ ‘‘మా సూచనలకు కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.’’ అన్నారు.
కర్ణాటక కమిటీ వలసవాద చట్టాల నుంచి స్వేచ్ఛ పేరుతో ఈ చట్టంలోని అనేక నిబంధనలలో ‘నామమాత్రపు, తాత్కాలిక’ మార్పులు చేశారని ఆరోపించింది.డీఎంకె అధికార ప్రతినిధి, న్యాయవాది మనురాజ్ షణ్ముగం బీబీసీతో మాట్లాడుతూ, "కేవలం బ్రిటిష్ వాళ్లు నిర్మించారన్న కారణంతో మీరు దాని పక్కనే మరో మరో రైల్వే ట్రాక్‌ను నిర్మించరు. కొత్త చట్టం వల్ల న్యాయవాదులు ఎక్కువగా ప్రభావితమవుతారు" అన్నారు.