నిండు గర్బిణీను పొట్టన పెట్టుకున్న భర్త

 
మరో 24 గంటల్లో ఆ ఇల్లాలు పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది.. ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త కు ఇన్నాళ్లు భార్యగా ఇక నుండి పుట్టబోయే బిడ్డకు తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తానని కలలు కన్నది.. ఇన్నాళ్లు ఏ కన్ను పడకుండా ఏ దిష్టి తగలకుండా పిండాన్ని భద్రంగా దాచుకుంది. కానీ ఇంతలోనే కట్టుకున్న భర్తే కాలయముడుగా మారి ఆ పిండం పెరుగుతున్న ఊపిరిని బలవంతంగా ఆపేసాడు. తల్లితో పాటు ఆ పిండానికి మరణ శాసనం రాసాడు. ప్రేమించిన వాడే ఇలా కర్కశంగా ప్రవర్తించిన ఘటన విశాఖలో తీవ్ర కలకలం రేపింది...

 అనూష, జ్ణానేశ్వర్ లు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. హోటల్ మేనేజ్ మెంట్ వరకు చదువుకున్న అనూషకు తండ్రి లేరు చనిపోయారు. తల్లి ఆరోగ్య సమస్యలతో కోమాలో మూడేళ్లు ఉంది. అనూషకు ఓ చెల్లి ఉంది. గాజువాక కు చెందిన జ్ణానేశ్వర్ పాయకరావుపేట అడ్డరోడ్డు ప్రాంతానికి చెందిన అనూషను రెండేళ్ల క్రితం పెళ్లిచేసుకున్నారు. పెళ్లి చేసుకున్న విషయం జ్ణానేశ్వర్ తల్లిదండ్రులకు తెలియదు. సింహాచలంలో స్నేహితులు, అనూష బంధువులు సమక్షంలో పెళ్ళిచేసుకున్నాడు. పెళ్లి చేస్కున్న అనంతరం మధురవాడ ఊడాకోలని కి మకాం మార్చేసారు. అక్కడ సంసారాన్ని స్టార్ట్ చేసారు భార్యభర్తలు జ్ణానేశ్వర్, అనూష. 
 జ్ణానేశ్వర్ స్కౌట్ గా పనిచేస్తున్నాడు. అంతేకాకుండా సాగర్ నగర్ ప్రాంతంలో రెండు ఫాస్ట్ పుడ్ సెంటర్లను నిర్వహిస్తున్నాడు. అయితే పెళ్లైన తర్వాత కొన్నాళ్లు సాఫీగానే సాగింది వీరిద్దరి సంసారం. కొన్ని రోజులు పోయాకా వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.. సరదాగా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్లినపుడు కూడా సరిగ్గా మెసులుకునేవాడు కాదని అనూష చెల్లి, స్నేహితులు చెపుతున్నారు. ఇలా గొడవలు జరుగుతుండగా గతంలో ఓ సారి ఈ మధ్య ఫలూదా కావాలని కోరింది గర్భిణీగా ఉన్న అనూష. తీసుకువచ్చి ఇచ్చాడు భర్త. అందులో ఓ టాబ్లెట్ కనిపించడంతో షాక్ కు గురైంది అనూష. ఇదెక్కడి నుండి వచ్చిందని భర్తను నిలదీయగా తనకు తెలియదని డ్రామాలాడాడు. 

 అప్పటి నుండి అనుమానంగానే ఉంది భార్య. నిన్న సాయంత్రం ఇంట్లో ఉండగా భార్య భర్తల మధ్య మళ్లీ గొడవ మొదలైంది. రాత్రి పడుకునే టపుడు భర్త భార్య అనూష మెడకు చున్నీ బిగించి చంపేసాడు. ఉదయం స్నేహితులుకు ఫోన్ చేసి భార్య అనూష కు ఏదో అయిందని చెప్పాడు. వెళ్లీ చూసే సరికి విగత జీవిగా పడి ఉంది అనూష. వెంటనే కేజీహెచ్ కు తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయి ఉంది. అనూష కడుపులో పెరుగుతున్న బిడ్డకూడా ప్రాణాలు బలైపోయాయి. కేజీహెచ్ దగ్గర పోలీసులు గట్టిగా ప్రశ్నించే సరికి నేరం అంగీకరించాడు భర్త జ్ణానేశ్వర్. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పీఎం పాలెం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ కి తరలించారు... నిండు గర్బిణీను పొట్టన పెట్టుకున్న భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు మృతురాలి బంధువులు, స్నేహితులు.... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు...